గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు ! మనమే మనతో మనకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చిన వ్యక్తిని గెలిపిస్తూ, నచ్చకపోతే ఓడిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖులకే పట్టంగడుతూ సమాజాన్ని శాసించే ఓటు హక్కుని పొంది ఉన్నాము. స్వదేశాన్ని స్వదేశియులే పరిపాలించాలనే మహోన్నతమైన సంకల్పంతో అనేకమంది దేశభక్తులు పరపరిపాలనపై తిరుగుబాటు చేసి, సాయుధ, నిరాయుధ పోరాటాలతో, ఉద్యమాలతో స్వపరిపాలనకోసం ప్రాణత్యాగాలు చేసారు. సుమారు శతాబ్దకాలం పోరాటంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొని పరదేశస్తుల పాలనను ప్రారద్రోలారు. ఆ మహానుభావులు ఎంతమందో? చరిత్రకెక్కింది ఎంతమంది ? చరిత్ర విశేషాలే గణిస్తే కనుక చరితకు రాని మహానుభావులు ఎంతమందో వారిలో చరితకెక్కిన కొంతమందిని అన్నా స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15 న తలచి జోహార్లు చెబుదాం.

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు: పరాయి పాలనలో వందల సంవత్సరాలు మగ్గిన భారతావనిని, భారతీయులు మొత్తంగా ఏకమై పరుల అధికారం నుండి దేశాన్ని స్వాతంత్ర్య దేశంగా సాధించుకోవడంలో ఎంతోమంది నాయకుల జీవితాల త్యాగం ఉంది. కొందరి జీవితం కాల్పుల్లో కలిసిపోతే, కొందరి జీవితం జైళ్లలో అంతరించి ఎంతోమంది దేశభక్తుల జీవితం పోరాటంలో పాల్గొని 90 సంవత్సరాల కాలం పోరాటం తరువాత స్వాతంత్ర్య భారతావని సాధించారు. 1857 – 1947 స్వాతంత్ర్య పోరాటం జరిగితే పోరాటంలో పోయిన ప్రాణత్యాగాల, ఎంతోమంది తమ జీవితాలను భరతమాత దాస్య సంకెళ్ళ విముక్తికై అర్పించిన దేశభక్తుల జీవిత త్యాగాల ఫలితం 1947 ఆగష్టు 15 తేది సంబరాలు.

మరుదనాయగం, వీరపాండ్య కట్టబొమ్మన్, మంగళ్ పాండే, నానసాహిబ్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్, బహదూర్ షా, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, టంగుటూరి ప్రకాశం, చంద్రశేఖర ఆజాద్, చిత్తరంజన్ దాస్, కొమరం భీం, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ కరం చంద్ గాంధి, జవహర్ లాల్ నెహ్రు, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాల లజపతి రాయ్ లాంటి ఎందఱో మహానుభావుల పోరాట ఫలితం నేటి మన స్వతంత్ర భారతదేశం.

పుస్తకాల ద్వారా స్వాతంత్ర్య పోరాటం, పోరాటంలో పాల్గొన్న నాయకుల గురించి పుస్తకాలలో చదువుకున్నాం, చదువుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లో అయితే మహానుభావుల గురించిన బయోగ్రఫీ మొబైల్ ఆప్స్ లభిస్తాయి. ఇంకా చలనచిత్ర రూపంలో కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల చరిత లభిస్తుంది. గతకాలపు చరిత్రలో కలిసి ఉన్న మన స్వాతంత్ర్య సమరయోధుల గురించి, స్వాతంత్ర్య దినోత్సవ రోజులలో గుర్తుచేసుకోవడానికి పుస్తకాల రూపంలో మొబైల్ ఆప్స్ రూపంలో సినిమాల రూపంలో యూట్యూబ్లో లభిస్తాయి.

స్వాతంత్ర్య సమరయోధుల నాయకుల చరిత చలనచిత్రాలు

భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో తెలుగువారిలో ఆంధ్రకేసరి అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు వారలబ్బాయిగా చదువుకుని ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వరాజ్య పత్రికకు సంపాదకీయం చేసారు, 1922 స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా 30000 స్వచ్చందకులతో ప్రదర్శన నిర్వహించారు. మద్రాసులో సైమన్ కమిషన్ ఎదుట తుపాకీ కాల్పులకు రొమ్ము విరిచి నిలబడి ఆంధ్రకేసరిగా ప్రసిద్దికెక్కారు. ఆగష్టు 23, 1872లో జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు 1957 మే20న స్వర్గస్తులైనారు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన తెలుగు చిత్రం ఆంధ్రకేసరి. విజయచందర్ ఆంధ్రకేసరిగా నటించి, ఆ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించారు.

పాండ్యరాజైన జగ్విర్ మరణానంతరం పాంచల్ మకురుచ్చీ ప్రాంతానికి రాజు అయిన వీరపాండ్య కట్టబొమ్మన్ పూర్వికులు ఆంధ్రులు. దక్షిణాది నామమాత్రపు నవాబు అయిన ఆర్కాట్ నవాబు ఈస్టిండియా కంపెనీకి తన అధీన రాజ్యాలపై కప్పం వసూలు చేసే ప్రక్రియని అప్పగిస్తాడు. అయితే కప్పం వసూలు చేసే నెపంతో స్థానిక రాజ్యాలను ఆక్రమించుకునే క్రమంలో ఉన్న ఈస్టిండియా కట్టబొమ్మన్ కప్పం కట్టకుండా ఎదురిస్తాడు. కప్పం వెంటనే కట్టకపోయిన పరవాలేదు, కట్టడానికి అంగీకరిస్తే చాలు అనే రాయబారాన్ని కూడా అంగీకరించడు. తొమ్మిదేళ్లుగా కట్టబొమ్మన్ ఏమిచేయలేకపోయిన ఈస్టిండియా కంపెనీ పాంచల్ మరుకుచ్చీపై యుద్దానికి వస్తారు. భారీ సైనిక దళంతో ఉన్న బ్రిటిష్ వారే యుద్దంలో పైచేయి సాధిస్తారు, కానీ కట్టబొమ్మన్ శత్రువుకు పట్టుబడకుండా తప్పించుకుంటాడు. అయితే మరలా ఇతర రాజులతో కలిసి యుద్ధం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న కట్టబొమ్మన్ ని పుదుక్కోట్టాయ్ జమిందారు తొండైమాన్ వంచనతో తన కోటకి ఆహ్వానిస్తాడు. అది పసిగట్టలేకపోయినా కట్టబొమ్మన్ బ్రిటిష్ వారికి బందీగా పట్టుబడతాడు. ఉరితీసే సమయంలో భరతమాతని తలుచుకుని ఉరితాడు తనకి తానే తగిలించుకుని ప్రాణత్యాగం చేస్తాడు. ఈవీరుని చరిత చలనచిత్రంగా వీరపాండ్య కట్టబ్రహ్మనగా తెలుగులోకి డబ్ చేయబడి ప్రేక్షకాదరణ పొందింది. బి.ఆర్. పంతులు నిర్మాణ దర్శకత్వంలో శివాజీ గణేషన్, ఎస్ వరలక్ష్మి, జెమిని గణేషన్ తదితరులు నటించారు.

1827 సంవత్సరం, జులై 19న జన్మించిన మంగళ్ పాండే 1857 సిపాయి తిరుగుబాటుకి ముందు బ్రిటిష్ వారిని ఎదిరించిన దేశభక్తుడు. సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసి తయారుచేసిన తూటాలను ఇచ్చి ఉపయోగించమన్న బ్రిటిష్ అధికారిని కాల్చి చంపి బ్రిటిష్ వారిని ఎదిరించిన తొలి భారతీయుడుగా చరిత్రకెక్కారు. 1857 సిపాయి తిరుగుబాటుకి మంగళ్ పాండే కలకత్తా దగ్గర బరాక్ పూర్ వద్ద 1857 మార్చి 29న బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన సంఘటన ప్రేరణగా చరిత్రకెక్కింది. ఈస్టిండియా కంపెనీ బెంగాల్ రెజిమెంట్ నందు సిపాయిగా ఉన్న మంగళ్ పాండే దాదాపు రెండు వందల ఏళ్ల తరబడి ఏలుతున్న పాలనకు ఎదురొడ్డి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిన వీరుడుగా, స్వాతంత్ర్య సమరానికి ఆద్యుడుగా నిలిచాడు. ఈ దేశభక్తుడుపై చలనచిత్రం హిందీ భాషలో మంగళ్ పాండే ది రైజింగ్ పేరుతో ఉంది. కేతన్ మెహతా దర్శకత్వంలో అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, అమీషా పటేల్ తదితరులు నటించారు.

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

ఒక స్వాతంత్ర్య సమరయోదుడుపై ఎక్కువ చలనచిత్రాలు ఉన్నది బహుశా భగత్ సింగ్ ఒకరే అయ్యివుంటారు. భగత్ సింగ్ 22 సెప్టెంబర్ 1907 సంవత్సరంలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమిలిస్తుంది అంటారు, అలా భగత్ సింగ్ చిన్ననాడే తండ్రికి చెప్పిన సమాధానంతో నిజమనిపిస్తుంది. కిషన్ సింగ్ భగత్ సింగ్ తో తోటకి వెళ్తే అక్కడ పొలంలో అడుకుంటూ గడ్డి పరకలను నాటుతుంటే, తండ్రి ఏమిటని ప్రశిస్తే బాల భగత్ సింగ్ నోట వచ్చిన మాట తుపాకులు నాటుతున్నాని. అలాంటి భగత్ సింగ్ 13 ఏళ్ల వయసులో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమంతో ప్రభావితుడై బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాల పాఠ్యపుస్తకాలు, వారి దిగుమతి దుస్తులు తగులబెడతాడు, అయితే అహింసావాదం ఉపయోగం ఉండదని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్ హింసాత్మక ఉద్యమం ఉదృతం చేస్తాడు. లాలాలజపతి రాయ్ హత్య నేపద్యంలో బ్రిటిష్ పోలీసు అధికారిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. భగత్ సింగ్ విప్లవ స్పూర్తిగా నిలిచిన భగత్ సింగ్ ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. భగత్ సింగ్ పై 1954లో షహీద్ ఎ-ఆజాద్ భగత్ సింగ్, 1963లో షహీద్ భగత్ సింగ్, 1965లో షహీద్ బాలీవుడ్లో చిత్రాలు వచ్చాయి. 2002 లో మూడు హిందీచిత్రాలు భగత్ సింగ్ ప్రేరణతో వచ్చాయి షహీద్ ఎ అజం, 23 మార్చ్ 1931 షహీద్, ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్. 2006లో భగత్ సింగ్ కాలం నాటి రోజుల నేపద్యంలో రంగ్ దే బసంతి విప్లవాత్మక చిత్రంగా ఉంది. 2008లో ఇంక్విలాబ్ 40నిమిషాల డాక్యుమెంటరీ చిత్రం ఉంది.

అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలకు నాయకత్వం వహించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి స్వాతంత్య్ర సమరయోధుడు. సాటి స్వాతంత్ర్య సమరయోధుల మాదిరి అతను ఉరితీయబడకుండానే అల్లూరి సీతారామరాజుని విచారణ లేకుండా కాల్చి చంపారు అంటే, ఆ ప్రభుత్వం ఎంత భయపడి ఉంటే ఆ పని చేస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయపెట్టించిన అల్లూరి సీతారామరాజు జననం 1897 జులై 4 వ తేది అయితే మరణం 7వ తేది మే 1924 సంవత్సరం. అయితే ఒక బుర్రకధలో సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ ! వీరుడు మరణించడు, విప్లవానికి పరాజయం లేదు అని అన్నారంటే అల్లూరి సీతారామ రాజు విప్లవ స్పూర్తి ఎంతమంది భారతీయులలో ప్రేరణగా ఉండి ఉంటుంది. మన్యం ప్రాంతంలో ఆటవికులపై అమానుష చర్యలకు పాల్పడే బ్రిటిష్ ప్రభుత్వానికి అల్లూరి సీతారామరాజు ఎదురు తిరిగి, మన్యం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఈ స్వాతంత్ర్య సమరయోధుడిపై అల్లూరి సీతారామరాజు పేరుతో తెలుగు చలన చిత్రం ఉంది. వి రామచంద్రరావు, కెఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల, కొంగరజగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, చంద్రమోహన్, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, త్యాగరాజు, కెవి చలం, మంజుల, రాజశ్రీ, జయంతి తదితరులు నటించారు.

మహాత్మా గాంధి జీవిత చలన చిత్రాలు

మహాత్మాగాంధి స్వాతంత్ర్యాన్ని శాంతిమార్గంలో సాధించాలని యోచించి, అనేక చోట్ల వేర్వేరుగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటాలలో ఐక్యతను సాధించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పంపించిన మహానుభావుడుగా జాతిపితగా భారతజాతి హృదయంలో నిలిచారు. భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్, అల్లూరి సీతారామరాజు వంటివారు సాయుధ పోరాటంలో సాధించలేని స్వాతంత్ర్య నిరాయుధ అహింసా మార్గంలో సాధించినవారిగా ఖ్యాతిగాంచారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఎలాంటి పదవి స్వీకరించకుండ ఉన్నారు, చివరికి నాదురాం గాడ్సే చేత కాల్చబడి చనిపోయారు. మహాత్మా గాంధీజీ జీవితం ఆధారంగా స్వాతంత్ర్య పోరాట చరిత నేపధ్యంలో గాంధీ టైటిల్ తో ఆంగ్ల చిత్రం ఉండడం విశేషం అలాగే ఆ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఆంగ్ల నటులతో ఆంగ్లంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. అలాగే గాంధి భావాలతో, గాంధి చరిత్ర ఆధారంగా హిందీ చిత్రాలు కూడా ఉంటే, తెలుగులో మాత్రం గాంధి ఆదర్శాలకి ప్రభావితమయ్యే ఒక గుండా కధ శంకర్ దాదా జిందాబాద్ చలనచిత్రం ఉంది. ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మాకోటక్, షియాజీ షిండే, సదా, పవన్ కళ్యాణ్ తదితరులు నటించారు. ఇవి స్వాతంత్ర్య సమరయోధుల నాయకుల చరిత చలనచిత్రాలు

ఆగష్టు15 పరతంత్ర పాలనా నుండి విముక్తి పొందిన దినం మన స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన నాయకుల జీవితాల త్యాగ ఫలితం. ఇంటి కష్టాలు చూసి చదువు మానేసి పనిచేసి సంపాదించి కుటుంబ భాద్యతని నెత్తిన వేసుకున్న యువకుడి మాదిరి భారతమాత దాస్య పాలనను చూసి జీవితాలని పణంగా పెట్టి పోరాడిన మహానుభావుల కృషి ఫలితం ఆగష్టు15 దినోత్సవం. ఒక విప్లవం పుట్టాలంటే ఎదో ఒక సంఘటన నాంది కావాలి, అటువంటి సంఘటనలలో ఎంతోమంది అప్పటికి బలై ఉంటారు. ఒక బలమైన అరాచాకత్వాన్ని ఎదురించాలంటే ఎన్ని బలమైన సంఘటనలు జరిగితే ఎంతమంది ప్రాణత్యాగాలు జరిగితే మొదలవుతుంది. విప్లవం నడవాలంటే శక్తివంతమైన నాయకుడు అవసరం, దేశంలో అనేక చోట్ల విప్లవాలు వేర్వేరుగా జరిగాయంటే ఎంతమంది నాయకులు నాయకత్వం వహించాలి. చరిత్రకి తెలిసేది విశేషం అయితే ఆ విశేషాన్ని అందించే జీవితాలు ఎన్ని ఉండి, ఉంటాయి. అలా జీవిత ప్రాణ త్యాగాలను చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులందరికీ జోహార్లు చెబుతూ జైహింద్.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్